Around Tirupati Visiting Places – తిరుపతిలో చుట్టు ప్రక్కల చూసిరావడానికి మంచి స్థలాలు ఏవి?

Around Tirupati Visiting Places – తిరుపతిలో చుట్టు ప్రక్కల చూసిరావడానికి మంచి స్థలాలు ఏవి?

ఇతర దేశాల పర్యాటక మేప్ లు చూస్తే, మనం ఎందుకీ అలసత్వం లో ఉంటామో తెలీదు. పర్యాటక చిత్రాల్లో మనం ఎంతో వెనుకబడి ఉండటానికి ఈ నిర్లక్ష్యమే కారణం.

తిరుపతి లో, దగ్గర దగ్గర, 32 ఏళ్ళు నివాసం . ఈ అనుభవం మీకు చెప్పటానికి సరిపోతుందనుకుంటా.

మాములుగా అందరు చూసేవి కాకుండా చుట్టుపక్కల ఒక 60 కి.మీ దూరం లో ఎక్కువ గుడులను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రయత్నం. ఇలాంటి పటమే ప్రకృతి ప్రేమికులకి కూడా చేయాలని ఉంది. చేసి తీరతాను.

Around Tirupati Visiting Places
credits: https://te.quora.com/profile/Appa-Rao-Muppalla

ముందుగా తిరుపతిని ఒక ఆధారం గా పెట్టుకుంటే ,ఇందులో ప్రతి గుడి ఎన్ని కి.మీ ఉందొ, ఉజ్జాయింపుగా తెలుస్తుంది. ఇందులో మూడు దిక్కులా , మూడు కోణాలుగా, మీ యాత్ర కొనసాగించ వచ్చు.

మొదట తూర్పు దిక్కుగా శ్రీ కాళహస్తి ఉంటుంది. ఇది రమారమి ౩7 కి.మీ దూరం లోఉంది. దీన్ని వాయులింగం అంటారు. శివుని గుడి. ఎంతో పురాతన మైనది. ఇక్కడ రాహుకేతు పూజలు ప్రతి నిత్యం చేస్తారు. కనీసం గంట ప్రయాణం. అలా పోయి వచ్చేటప్పుడు మధ్యలో పక్క దారిలో వెళ్లి గుడిమల్లం లో పరశురామేశ్వర గుడి చూడవచ్చు.ఇది భారత దేశం లోనే ప్రాచీన దేవాలయం అని పేరు గన్నది.

ఇక దక్షిణ దిక్కులో మొదట తిరుచానూర్ పద్మావతి దేవాలయం. కేవలం ఐదు కి.మీ దూరం లోనే ఉంది. ఇక్కడ కొద్దిగా రద్దీ ఉంటుంది. లక్ష్మీ దేవి కదా, అందరికీ అవసరమే మరి. ఆపైన కొంచెం పక్క మార్గంగా, అప్పలాయ గుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇక్కడ పెళ్లి చేసుకున్న వేంకటేశ్వరుడు దర్శనమిస్తారు అంటారు. అభయముద్ర లో ఉంటాడు కనుక, శ్రేష్టమని కొంద రంటారు. మళ్ళీ అదేవరుసలో, మద్రాసు వెళ్ళే దారిలో, పుత్తూర్ పక్కన నారాయణ వనం లో, వేంకటేశ్వర స్వామి, ఇంకొంచెం ముందుకు వెళ్తే, నాగలాపురం లో మత్స్యావతార విష్ణు మూర్తి గుడి, ఉంటుంది. ఇంకొంచెం పైన శయన మూర్తిగా ఉన్న ఏకైక శిల్పం సురుటు పల్లి(ఊత్తుకోట-తమిళ నాడు) లో, పల్లి కొండేశ్వర శివాలయం ఉంది. ఈ గుడిలో గరళం తాగిన శివుడు, పార్వతి ఒడిలో, పడుకున్న శిల్పం( రాయి కాదు కనుక అభిషేకం ఉండదు) ఉంటుంది. ఇలాంటిది ఎక్కడా లేదని వినికిడి.

Temples Around Tirupati
credits: https://te.quora.com/profile/Appa-Rao-Muppalla

ఇక అక్కడి నుంచి కొద్దిగా వెనక్కి వచ్చి, తమిళ నాడు వేపు సాగిపోతే తిరుత్తని(70km), కంచి వస్తాయి.

ఇదే విధంగా తిరుపతి నుంచి పశ్చిమ దిశగా వెళ్తే కాట్పాడి, బెంగళూరు వస్తాయి. ఈ వేపు శ్రీనివాస మంగాపురం దగ్గరలో ఉన్న గుడి. ఇక్కడ కొండమీద ఉన్న తిరుమల వెంకటేశ్వరస్వామి కంటే, పెద్ద ఆకారంలో ,అలాంటి రూపంతో వేంకటేశ్వరుడు కనిపిస్తాడు. కొంచెం పక్కగా,ముక్కోటి లేదా తొండవాడ అనేచోట, చిన్న నదీ పాయ పక్కన, శివుడి గుడి ఉంది. అలానే ఒక 60 కి.మీ దూరంలో, కాణిపాక వినాయకుని గుడి, ఉంటుంది. దేవుళ్ళు సినిమా, చూపిన గుడి ఇదే. ఇక్కడ నుండి, సుమారు అంతే దూరం లో, తమిళ నాడు కాట్పాడి పక్కన,రాయ వేలూరు అవతల , గోల్డెన్ టెంపుల్ అని, బంగారు అమ్మవారి గుడి ఉంది. దీన్నే లక్ష్మీనారాయణి గుడి అంటారు.

ఇవండీ సూక్ష్మంగా, తిరుపతి చుట్టూ పక్కల ఉన్న, ప్రఖ్యాత లేదా కొంచెమే తెలిసిన గుళ్ళు.

నేను కుడి పక్షం అని, సంప్రదాయ వాదిని అని మీరు ఖాయం చేసుకున్న పర్లేదు కానీ, ఈ చిత్రాలు, సమాచారం ఇతరులకు సహాయ పడితే మాత్రం చాలు ,అదే పదివేలు.

** పైన చెప్పిన గుళ్ళలో ఎక్కువ భాగం TTD వే కాబట్టి పొద్దుటి నుండి సాయంత్రం వరకు తెరిచే ఉంచుతారు. వీటి గురించి సమాచార కేంద్రం వద్ద అడిగి తెలుసుకోవచ్చు. ఆలయ దర్శనం అనే బస్సు వారే నడుపుతారు. అందులో వీటిలో చాలావాటిని వారు చూపుతారు. అలా కాకుండా మీరే ఒక కారు పెట్టుకుని చూ స్తే తొందరగా చూసేయోచ్చు

Leave A Comment

Leave a Reply

More Updates